అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంచలన నిర్ణయానికి వేదికగా మారింది. రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలన్న తీర్మానం శాసనసభ ముందుకొచ్చింది. సోమవారం శాసనసభ సమావేశం ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండలిని రద్దు చేసే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానంపై సభ చర్చకు చేపట్టింది. (ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం)


మండలి రద్దు తీర్మానంపై డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చర్చను ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిని తరలించడం లేదని, మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో భూముల కొనుక్కున్న టీడీపీ నేతలే కావాలని రచ్చ చేస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను నివారించేందుకే మూడు రాజధానులు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే అని స్పష్టం చేశారు.

అంతకుముందు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం మండలిని రద్దు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వం ప్రతిపాదించిన పలు బిల్లులతో పాటు వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు వంటి కీలకమైన బిల్లులను మండలి తిరిస్కరించిన విషయం తెలిసిందే. పైగా వికేంద్రీకరణకు సంబంధించి కీలకమైన బిల్లును రూల్ 71 పేరుతో అడ్డుకోవడమే కాకుండా పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే తనకున్న విచక్షణాధికారాల మేరకు దానిని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని మండలి చైర్మన్ కాలయాపన ఎత్తుగడులను ఎంచుకోవడం, ప్రతిపక్ష పార్టీ అభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకోవడంపై అధికార పార్టీ తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోనే మండలిని రద్దు చేయాలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. (సీఎం జగన్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం)